భూగర్భ నీటి మట్టాన్ని పెంచేలా నీటి సంరక్షణ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయటంపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భూగర్భ నీటిమట్టం పెంపు, సమర్థంగా వరద నీటి నిర్వహణపై
గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డిఆర్ఓ బి. చిన ఓబులేసు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ …పంటలకు అవసరమైన నీటి భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నీటి సంరక్షణ కట్టడాలను పూర్తి చేయడం ద్వారా అధిక వర్షాలు కురిసినప్పుడు భూమిలో తేమ పెరిగి తరువాతి ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా పంటలను కాపాడుకునే వీలు ఉంటుందన్నారు. ఆయా జిల్లాలోని భూగర్భ నీటిమట్టం, తదితర వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని పరిస్థితిని వివరించారు. స్థానిక పరిస్థితులకుతోడు పరిమితికి మించి భూగర్భ నీటిని వినియోగించడం వలన పశ్చిమ ప్రాంతంలో భూగర్భ నీటిమట్టం పడిపోయిందన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచడం పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భూగర్భ నీటి సంరక్షణలో రిలయన్స్ ఫౌండేషన్ వంటి సంస్థలను కూడా భాగస్వాములను చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారిని కూడా భాగస్వాములను చేసి వారి అవసరాల మేరకు డ్వామా ఆధ్వర్యంలో నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేలా ‘ వాటర్ బడ్జెట్ ‘ రూపల్పన చేశామన్నారు. వాన నీటిని నిలువచేసే నిర్మాణాలు ( రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ) జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా చేపట్టామని కలెక్టర్ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వీటి నిర్మాణంతోపాటు నిర్వహణపైనా తగినంత దృష్టి పెట్టాలన్నారు. భూగర్భ, ఉపరితల నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా నీటి ప్రవాహంలో ఇబ్బందులు లేకుండా కాలువలను శుభ్రం చేయటంలోనూ, నీటి సరఫరాలోనూ సాగునీటి సంఘాలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. నీటి నిర్వహణపై ఇకనుంచి రెండు వారాలకు ఒకసారి తాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని కలెక్టర్లకు ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులతో పాటు సాగునీటి సంఘాల ( డీ.సీ.లు, పీ.సీ.లు, డబ్ల్యూ.యూ.ఏ.లు) చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు.


