జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లో పురోగతి చూపడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, డ్వామా అధికారులను ఆదేశించారు.
బుధవారం ముండ్లమూరు మండలం, సింగన్నపాలెం గ్రామ పంచాయితీలో ఉపాధిహామీ పధకం కింద చేపట్టిన ఇంకుడు గుంతలను కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఆకస్మిక తనిఖీ చేసి సంబంధిత లబ్దిదారులు కందిమళ్ళ రాంబాబు తో మాట్లాడి వివారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆరా తీయగా, సంబంధిత పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించనందున వారు పారిశుద్ధ్య విధులు నిర్వర్తించడం లేదని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్, సింగన్నపాలెం గ్రామ పంచాయితీ పరిధిలోని తుర్లపాటి వెంకటేశ్వర్లు కు చెందిన వరి పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడటం జరిగింది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, యూరియా సక్రమంగా అందుతున్నదా, ఎకరాకు ఎంత యూరియా వాడుచున్నారు, గ్రామంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి వ్యవసాయ సాగుకు సంబంధించిన సూచనలు ఇస్తున్నారా లేదా, ఎకరాకు ఎంత దిగుబడి వస్తున్నది, ఎకరాకు ఎంత ఆదాయం వస్తున్నది, ప్రకృతి వ్యవసాయ విధానం ఎందుకు చేపట్టడం లేదు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, రైతు ను అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు 30 వేల వరకు ఖర్చు అవుతున్నదని, ఖర్చులు పోనూ ఎకరాకు సుమారు 10 వేల వరకు ఆదాయం వస్తున్నదని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవని రైతు, కలెక్టర్ కు వివరించారు. ఈ ప్రాంతంలో ఈ సీజన్లో చాలా మంది రైతులు వరి సాగుకు బదులు మొక్కజొన్న సాగు చేపట్టడం జరిగిందని, వరి సాగు కంటే మొక్కజొన్న సాగులో కొంత మేర ఆదాయం ఎక్కువగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టి కి తీసుకు వచ్చారు. సింగన్నపాలెం గ్రామానికి సంబంధించిన పొలాలు దోసకాయలపాడు, పోతక మూరు, సింగన్నపాలెం మూడు గ్రామాల పరిధిలో విస్తరించి వున్నాయని, ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేస్తే సాగు నీటికి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకువచ్చారు.
కలెక్టర్ వెంట జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ , దర్శి నియోజక వర్గ ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వర రావు, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

