ఫ్లెక్సీలు మరియు ప్లకార్డుల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు –ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ – డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి హెచ్చరిక

ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీ పోస్టర్స్ మరియు ప్లకార్డుల రూపంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తించే విధమైన భాష ప్రయోగం, అసభ్యకర వ్యాఖ్యలు కనిపించడం నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ పలు సూచనలు చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, మతసామరస్యాన్ని కాపాడటానికి ఈ విధమైన ప్రవర్తనను నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ కిందివిధంగా ఫ్లెక్సీ డిజైన్/ప్రింటింగ్ సంస్థలకు మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
పలు సూచనలు చేశారు.
ప్లెక్సీలలో కుల,మత, సామాజిక వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఎటువంటి విషయాలు ఉండరాదు. ఫ్లెక్సీ పోస్టర్లలో ఎటువంటి వర్గ విద్వేషాలను ప్రోత్సహించే పదాలు, వ్యాఖ్యలు ఉండరాదు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ఇతరుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఫ్లెక్సీలలో వాడితే అది నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. అలాంటి ఫ్లెక్సీలకు బాధ్యత వహించిన వ్యక్తిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
విచక్షణ లేకుండా ఎటువంటి ఫ్లెక్సీ అయినా ముద్రించడం ద్వారా, ప్రజా శాంతి భద్రతలకు, వివాదాస్పద విషయాలకు మద్దతుగా నిలబడే డిజైనర్లు, ప్రింటింగ్ సంస్థలు కూడా చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని , నేరంతో సహకరించిన వారిగా పరిగణించబడి, సంబంధిత చట్ట సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారి దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేయాలనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు రూపొందించి, మత విశ్వాసాలను కించపరిచేలా ఉండే పదజాలం వినియోగించడం లేదా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు మార్గం వేయడం సరైనది కాదు. ఇలా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫ్లెక్సీ రూపకల్పన చేసే ప్రతి డిజైనర్, ముద్రణ సంస్థ తమ బాధ్యతను గుర్తుంచుకోవాలి. కస్టమర్ అడిగినదాన్ని ప్రింట్ చేయకూడదు. ప్రతి పదం, ప్రతి వాక్యం పర్యవసానాలను కలిగి ఉంటుంది. సామాజిక చైతన్యం కలిగి ఉండే అంశాలను మాత్రమే ప్రచారం చేయాలి కానీ, ఇతరులను ఉద్దేశపూర్వకంగా నిందించే విధంగా ఉండకూడదు.

అలాగే, యువత, రాజకీయ కార్యకర్తలు, సంఘ సంస్థలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించేటప్పుడు శాంతియుత మార్గాలు ఎంచుకోవాలి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలను షేర్ చేయడం, వాటిని ప్రోత్సహించడం వంటి చర్యలు కూడా నేరాలలోకి వస్తాయని గుర్తించాలి. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలి.

శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అత్యవసరం మని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *