బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ కి ఆదివారం ఒంగోలు జిల్లా పోలీస్ కల్యాణ మండపంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, జిల్లా సబ్ డివిజనల్ డిఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది శాలువాలు, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ ….గత 14 నెలల కాలంలో ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ సేవలు అందించేందుకు అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది చూపిన నిబద్ధత అభినందనీయమైందని అన్నారు. బదిలీ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి వెళ్లిపోతున్నప్పటికీ, ఈ జిల్లాలో పనిచేసిన అనుభవాన్ని, మీ అందరి సేవా తత్పరత ఎన్నటికీ మరవలేనని అన్నారు. అలాగే విద్యార్థుల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
లా అండ్ ఆర్డర్, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగాల సిబ్బంది ఎల్లప్పుడూ రహదారులపై నిత్యం శ్రమిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలోనే కాకుండా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడం, ముఖ్యమైన బందోబస్తు కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక అంశాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. జిల్లా శాంతిభద్రతలు, పరిపాలనలో సహకరించిన జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది వారి వారి విధులను ఎంతో నిబద్ధతగా విధులు నిర్వర్తించారని, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా పోలీస్ శాఖ ప్రతిష్ఠను కాపాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మరింత నిబద్ధతతో పని చేస్తే, పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా ప్రకాశం జిల్లాతో ఉన్న అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు.
కార్యక్రమంలో పలువురు ఏఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు ఎస్పీ సేవలను గుర్తుచేసుకుని అభినందనలు తెలిపారు. ఎస్పీ భవిష్యత్ లో పదవీ జీవితంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్, ఏ ఆర్ డి ఎస్ పి కె. శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



