“మీ కోసం” లో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ
ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీ కోసం” కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. వచ్చిన ఆర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్ లైన్ లో వచ్చిన వినతులను చూడాలని, అలాగే వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారం చూపుతూ రీఓపెన్ కేసులు రాకుండా చూడాలని ఆయన దిశా నిర్దేశం చేసారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటి కలెక్టరు కుమార్, జాన్సన్, శ్రీధర్ రెడ్డి, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

