పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ను వచ్చే ఏడాది ఆగష్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు – జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

ప్రకాశం జిల్లా జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ను వచ్చే ఏడాది ఆగష్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజబాబు తొలి ప్రాధాన్యంగా శుక్రవారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలసి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కు సంబంధించి దోర్నాల మండలం, కొత్తూరు వద్ద నిర్మిస్తున్న 2వ టన్నెల్ ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఇప్పటివరకు పనులు కొనసాగిన తీరు, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం గంటవానిపల్లె చెరువు వద్ద కాలువ పనులను, తీగలేరు వాగును పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్, దోర్నాల మండల కేంద్రంలోని వెలిగొండ ప్రాజెక్టు అతిధి గృహంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్, భూసేకరణ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, పునరావాస కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ఇప్పటికే మొదటి సొరంగం పనులన్నీ పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. రెండో సొరంగం పనులు కూడా 70 శాతం వరకు పూర్తయ్యాయని కలెక్టరుకు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కలిగే తాగు, సాగునీటి ప్రయోజనాలు, ఇతర వివరాలను ప్రాజెక్ట్స్ ఎస్.ఈ. అబూత్ అలీమ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ ప్రాజెక్ట్ పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండో సొరంగం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ప్రాధాన్యంగా ఈ రోజు అధికారులతో కలసి వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున పనులు త్వరగా పూర్తయ్యేలా మరింత దృష్టి సారించాలని ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణ ప్రతినిధులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థకు అవసరమైన సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీల కోసం అవసరమైన ల్యాండ్ డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయన్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం ఇచ్చి ముంపు గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, ముంపు గ్రామాల ప్రజల తరలింపును వచ్చే ఆగస్టు నాటికి పూర్తి అయ్యేలా చూస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో సుమారు 1,90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 15 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేసేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో ఘనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం నుంచి వలసలను నివారించి సస్యశ్యామలం చేయాలన్న ప్రజల కోరికను
నెరవేర్చేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, శ్రీ సత్యనారాయణ, సీతారామిరెడ్డి, నియోజక వర్గ టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు, ప్రాజెక్టు ఇంజనీరింగ్, నిర్మాణ ప్రతినిధులు తదితరులు హాజరైనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *