గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాబడిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, గనుల శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లోని తన చాంబరులో గనుల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలోని గనుల విస్తీర్ణము, వాటి రకాలు, లభిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, తదితర వివరాలు పై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 432.94 కోట్ల రూపాయల రాబడి లక్ష్యంగా నిర్దేశించగా, సెప్టెంబర్, 2025 మాసాంతానికి 157.08 కోట్ల రూపాయలు రావడం జరిగిందని, అల్లాగే జిల్లాలో మేజర్, మైనర్ మైనింగ్ క్వారీ లు వుండగా, అందులో 144 క్వారీ లు పనిచేస్తుండగా, 132 క్వారీలు పనిచేయడం లేదని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ తెలుపుతూ, సంబంధిత వివరాలను సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టరుకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా లో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన రాబడి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మైనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా లో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగరాదని స్పష్టం చేసారు. జిల్లాలో ఏ కారణం చేత మైనింగ్ క్వారీ పనిచేయడం లేదన్న విషయాన్ని సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్, గనుల శాఖ డిడి ని ఆదేశించారు.
ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఆ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

