ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువు లోపు చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్దిఒ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, పార్ధసారధి, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులు మరలా రీఓపెన్ కాకుండా నిర్ణీత గడువు లోపు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, ఆ నమ్మకాన్ని ప్రతి అధికారి నిలబెట్టుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీలన్నీ నిర్దేశిత గడువులోగా పరిష్కారం కావాలని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయడం వలన అర్జీలు పెండింగ్ ఉండబోవని చెప్పారు. పరిష్కారం అయిన వినతుల పట్ల అర్జీదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరచాలని, ఆ దిశగా చర్యలు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు .

