తాళ్లూరుమండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడు లో 9వతరగతి చదువుతున్న మైనర్ బాలికకు జరుగుతున్న వివాహాన్ని మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు గురువారం అడ్డుకున్నారు. తూర్పుగంగవరం జడ్పీహైస్కూల్ లో విజిట్ చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి అధికారుల వద్దకు వచ్చి 9వ తరగతి చదు వుతున్న సోమవర్పాడు చెందిన ఎస్సీ కాలనీబాలికకు వివాహం చేస్తున్నారని చెప్పారు. దీంతో వెంటనే అధికారులు సోమవర్పాడు అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సూపర్వైజర్, పోలీస్ శాఖకు ప్రత్యేకాధికారి సమాచారం ఇచ్చి గ్రామ విలేజ్ పోలీస్, విఆర్వోలను వెంట బెట్టుకుని పెళ్లి పందిరి వద్దకు వెళ్లారు.
పెళ్లి కుమారుని బంధువుతో మాట్లాడారు. మైనర్ బాలికకు వివాహం చేస్తున్నందున కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాము వివాహం చేయటం లేదని, నిశ్చయ తాంబూలం తీసుకుంటామని పెళ్లికుమారుని కుటుంబీకులు తెలిపారు. మైనర్ బాలిక ఇంటి వద్దకు వెళ్లి కుటుంబీకులతో పెళ్లి జరుపవద్దని చట్టరీత్యా నేరమ న్నారు. మైనర్ బాలిక వద్దకు అధికారులు వెళ్లి చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే
జరిగే అనార్ధాలను వివరించారు. ఇద్దరి కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ తీరే వరకు బాలికకు వివాహం చేయమని ఒప్పంద పత్రం రాయించుకున్నారు. అధికారుల రంగప్రవేశంతో పెళ్లి పెద్దలు భయాందోళన చెంది పెళ్లి చేయమని అంగీకరించటంతో అధికారులు వెనుదిరిగారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ అజిత , ఎంఈవో జి.సుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీవో నాగమల్లేశ్వరి, విఆర్వోలు శివారెడ్డి,” రమణారెడ్డి తదితరులు ఉన్నారు.
