ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులకి కల్పిస్తున్న సౌకర్యాలను పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఖచ్చితంగా అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. చిన ఓబులేసు
స్పష్టం చేసారు.
మంగళవారం ఉదయం నాగులుప్పలపాడు మండలం ,పోతవరం గ్రామంలో బీ.సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ ఇనిస్ట్యూషన్ – వన్ ఆఫీసర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోతవరం గ్రామంలోని బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. వసతి గృహం లోని వాష్ రూమ్స్ , స్నానపు గదులు, వంట గది, విద్యార్థులు పడుకునే గదులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో ఆయన మాట్లాడారు. రోజు మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా , రోజూ పరిసరాలు ఇలానే పరిశుభ్రంగా ఉంటున్నాయా లేక మేము వస్తున్నామని ఇలా ఉంచారా అని అడిగారు. విద్యార్థులు రోజూ ఇలాగే ఉంటుంది సార్ అని చెప్పారు. వసతి గృహాలలో లోపాలని గుర్తించి ,వాటిని సరిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.విద్యార్ధులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, లేకుంటే చర్మ వ్యాధులు ప్రబలుతాయని చెప్పారు. విద్యార్ధులకి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని క్రమశిక్షణ కలిగి ఉండి చక్కగా చదువుకోనీ ఉన్నత స్థాయి కి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి నెల డాక్టర్ వచ్చి ప్రతి విద్యార్థినీ పరీక్షించి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న విద్యార్ధులను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఎప్పుడూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ,ఏదన్న సమస్య ఉంటే వెంటనే స్థానిక తహసీల్దార్ కి తెలియజేయాలని వార్డెన్ కి చెప్పారు.
అంగన్వాడీ కేంద్రం తనిఖీ …
నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.పిల్లలకి అందించే ఆహారం,కోడి గుడ్లను ఆయన పరిశీలించారు. పిల్లలకి , గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పిల్లల ఎత్తు , బరువులను రిజిస్టర్ లో నమోదు చేసిన విధంగా ఉన్నాయా లేక తేడా ఉందా అని ఆయన ఎత్తు,బరువు మిషన్ల ద్వారా పరీక్షించారు. ఎప్పటికప్పుడు పరీక్షిస్తా ఉండాలని, అతి తక్కువ బరువులు ఉన్న పిల్లల్ని సాధారణ ఆరోగ్య కేంద్రాలకు కాకుండా ఎన్ ఆర్ సి సెంటర్స్ కీ మాత్రమే పంపాలని ఆయన ఆదేశించారు . పిల్లల పెరుగుదల, చదువు వివరాలను తల్లి దండ్రులకి తెలియజేయాలన్నారు. నిత్యం సూపర్ వైజర్ లు, సి.డి.పీ.ఓ లు అంగన్వాడీ కేంద్రాలని తనిఖీ చేసి లోపాలను గుర్తించి వెంటనే సరి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

