ప్రసిద్ధి గాంచిన కొత్తపాలెం పోలేరమ్మకు గ్రామంలోని మహిళలు పొంగళ్లు పెట్టి గురువారం నైవేద్యాలు సమర్పించారు. పోలేరమ్మ ఆలయ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం గ్రామస్తులు ఐకమత్యంగా పోలేరమ్మకు మొక్కులు చెల్లిస్తున్నారు. మండలంలో కొత్తపాలెం పోలేరమ్మ తల్లి మహిమగల తల్లిగా ప్రజలు భావిస్తూ అన్ని గ్రామాల ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. దీంతో గ్రామస్తులు పోలేరమ్మ ఆలయంను పునరుర్ధరించారు. ప్రతి ఏటా ఘనం గా ఆలయ వార్సికోత్సవాలు జరుపుతున్నారు. అందరూ కలిసికట్టుగా భారీ ర్యాలీగా ఆలయం వద్దకు తరలి వచ్చారు. గమిడి దేవతలకు, పోతురాజు విగ్రహాలవద్ద పొంగళ్లు పెట్టి అందరినీ చల్లంగా చూడాలని వేడుకున్నారు. ప్రతి ఇంటినుండి మహిళ పొంగళి గిన్నెతో తరలి వచ్చారు. అధిక సంఖ్యలో మహిళలు గ్రామోత్సవంలో పాల్గొ న్నారు. బంధువులు గ్రామానికి చేరుకోవటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పోలేరమ్మ గుడికి వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

