హైదరాబాద్ మహిళల రక్షణకు ,,స్పందన, సిస్టమ్.

హైదరాబాద్ ఏప్రిల్ 27 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరంలో మహిళల రక్షణ కోసం నగర పోలీస్ ల ఆధ్వర్యంలో స్పందన ఆల్ విమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టం ను అందుబాటులో తీసుకువచ్చారు.
విశ్వనగరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మహానగరంలో మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. నగరంలోని మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్నంగా రూపొందించిన “స్పందన – ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్”ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీ ఐసీసీసీ ప్రాంగణంలో సోమవారం స్పందన బృందాలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్పందన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఆపదలో ఉన్న మహిళలు తమ ఇబ్బందులను మహిళా పోలీసుల వద్దే మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పుకోగలరన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రస్తుతమున్న డయల్-100, 112 వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తూ రూపొందించిన ఈ స్పందన బృందాలు బాధితులకు తక్షణ సాయంతో పాటు కొండంత భరోసాను కల్పిస్తాయి. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి డయల్-100 కంట్రోల్ రూమ్‌కు అత్యవసర కాల్ రాగానే, ఆసమాచారాన్ని వెంటనే సంబంధిత జోన్‌లోని స్పందన బృందానికి బదిలీ చేస్తారు. నిమిషాల వ్యవధిలోనే ఈ బృందం తమ ప్రత్యేక వాహనంలో ఘటనా స్థలానికి చేరుకుంటుంది. ఫస్ట్ రెస్పాండర్‌గా అక్కడికి చేరుకునే సిబ్బంది ముందుగా పరిస్థితిని అంచనా వేసి బాధితులను వెంటనే తమ వాహనంలోకి తీసుకుని రక్షణ కల్పిస్తారు. శారీరక దాడులు లేదా గాయాలైన పక్షంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తారు.
నిందితులు అక్కడే ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తారు. బాధితులకు చట్టపరమైన రక్షణలను వివరించి వారిలో మనోధైర్యాన్ని నింపడంతో పాటు, అవసరాన్ని బట్టి భరోసా, సఖి కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ వారి ఇష్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు.
అత్యవసర కాల్స్ లేని సమయాల్లో ఈ బృందాలు రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల్లో మహిళా భద్రతపై విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు లా అండ్ ఆర్డర్ జోన్లలో ఈ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి రెండు డివిజన్లకు ఒక బృందం చొప్పున మొత్తం 14 ‘స్పందన’ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాల ప్రత్యేకత ఏమిటంటే డ్రైవర్‌తో సహా సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. ప్రతి బృందంలో ఒక మహిళా పోలీస్ డ్రైవర్, ఒక సివిల్ మహిళా కానిస్టేబుల్, ఒక ఏఆర్ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంటారు. వీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక షిఫ్ట్, సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టులో నిరంతరంఅందుబాటులో ఉంటారు. ఈ 14 బృందాలు హైదరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ పర్యవేక్షణలో పనిచేస్తాయి.
ఈ వ్యవస్థ కోసం ఎంపిక చేసిన 56 మంది మహిళా సిబ్బందికి చట్టపరమైన నిబంధనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మరక్షణ మెలకువలు, ప్రథమ చికిత్స, సీపీఆర్ చేయడంలో ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చారు. షీ టీమ్స్, సఖి, చైల్డ్‌లైన్ వంటి విభాగాలతో సమన్వయంపై వీరికి ప్రత్యేక తర్ఫీదు లభించింది. అలాగే 28 మంది మహిళా సిబ్బందికి ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి లైసెన్సులు కూడా మంజూరు చేయించారు. ప్రతి బృందానికి కేటాయించిన ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు, డ్రాగన్ లైట్లు, అత్యవసర వైద్య కిట్లు, వీహెచ్‌ఎఫ్ వైర్‌లెస్ సెట్లు, ట్యాబ్లెట్లు, డిజిటల్ కెమెరాల వంటి అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా, వారు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా కొండంత అండగా నిలిచేందుకు హైదరాబాద్ నగర పోలీస్ యంత్రాంగం ఈ ప్రతిష్టాత్మక ‘స్పందన’ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు కార్యాచరణలోకి తీసుకువచ్చింది.ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ , డీజీపీ బి.శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, అదనపు కమిషనర్లు ఎం. శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్బాల్ , జాయింట్ సీపీలు డి. జోయల్ డేవిస్, ఎన్. శ్వేత,మహిళా భద్రతా విభాగ డీసీపీ డాక్టర్ లావణ్య నగరంలోని అన్ని జోనల్ డిసిపిలు మరియు ఇతర అధికారులు, నగరలు పీస్ కమిటి సభ్యులు, హెచ్.సి.హెచ్.సి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *