పీఎం సూర్యఘర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. శనివారం అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అనమనమూరులో పీఎం సూర్యఘర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేదలకు విద్యుత్ స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచితంగా సూర్యఘర్ కనెక్షన్లు అందిస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మూడు నెలల్లో 6 లక్షల సూర్యఘర్ సోలార్ కనెక్షన్లు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. మరోవైపు పీఎం కుసుమ్ పథకం ద్వారా వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. అనంతరం రూ.18 లక్షల వ్యయంతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. అనంతరం కొత్తగా నిర్మించిన అంకమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉందని తెలిపారు.



