ఘన చరిత కలిగిన ఒంగోలు పురపాలక సంఘ వైభవాన్ని ప్రజలకు తెలిపేలా అధికార యంత్రాంగం చేపట్టిన వేడుకలలో తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ లో ఏర్పాటుచేసిన 25 అడుగుల ఏకశిలా అశోక్ చిహ్న స్థూపం ప్రారంభోత్సవం, లోగో ఆవిష్కరణ కార్యక్రమం వేద మంత్రోచ్ఛరణల మధ్య అట్టహాసంగా జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ అయిన పి.రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ వీటిని ఆవిష్కరించారు. ఈ 150 ఏళ్లలో ఒంగోలు మున్సిపాలిటీలో చోటుచేసుకున్న పరిణామాలను తెలిపేలా రూపొందించిన వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు, బిపిసిఎల్, ఇండోసోల్ పరిశ్రమలు, గ్రానైట్ ఇండస్ట్రీ ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతున్న ప్రకాశం జిల్లాలో అతిథులకు ఆతిథ్యం ఇచ్చేలా సకల సౌకర్యాలతో ఒంగోలు నగరం కూడా కాలానుగుణంగా అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ప్రస్తుత పరిణామాలను, ఒంగోలు పురపాలక సంఘ గత వైభవాన్ని తెలిపేలా 150 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు చెప్పారు. 1876 సెప్టెంబర్ 30వ తేదీన ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు వివిధ ఆవిష్కరణలు, ప్రారంభోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగంతో కలిసి రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ అశోక స్తూపం సుపరిపాలనకు నిదర్శనమని చెప్పారు. అంతటి విశిష్టత కలిగిన ఈ స్థూపాన్ని నగరంలో ఎంతో గుర్తింపు పొందిన చర్చి సెంటర్లో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఈ స్థూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ఈ ప్రాంతాన్ని చర్చి సెంటర్ గానే పిలుస్తామని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాలలో ఇలాంటి చిహ్నాలు, విగ్రహాలు, పెయింటింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా నగర అభివృద్ధి పైనా, రోడ్ల విస్తరణ పైనా ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం కూడా నగరవాసులకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తానని చెప్పారు. విశాఖపట్నం కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉన్న కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా ఒంగోలు నగరాన్ని కూడా అభివృద్ధి చేసేలా ప్రజా ప్రతినిధులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ మన చరిత్రను భావితరాలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా వచ్చే ఐదు నెలల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించడం శుభ పరిణామామని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, రవిప్రియ హాస్పిటాలిటీ అధినేత కంది రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, ఏ.ఎం.సీ. చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


