ఒక సామాన్య కుర్రాడు.. అవమానాలతో వెండితెరపై అడుగు పెట్టాడు.. కసి, నిరంతర సాధనతో తనని తాను చెక్కుకున్నాడు.. డ్యాన్సులు, ఫైట్లతో బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని శాసించాడు. మాములు నటుడిగా కనిపించిన వ్యక్తి.. నేడు కోట్ల మంది గొంతుకగా మారి రాజకీయ రంగంలో పెను సంచలనం సృష్టించాడు. అభిమానుల గుండెల్లో ‘దళపతి’గా ముద్ర వేసుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) జన నాయకుడిగా (విజయ్ ) తన కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. రీల్ లైఫ్ హీరో నుంచి రియల్ లైఫ్‌లో రాజకీయ నాయకుడిగా ఎంట్రీలోనే ప్రభంజనం సృష్టించారు విజయ్. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన జర్నీని గుర్తుచేసుకుందామా..
గదిలోనే చిన్నతనం.
1974 జూన్ 24న విజయ్ జన్మించారు. తల్లి శోభ గాయని, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. తొలినాళ్లలో కనీసం బాత్రూమ్ కూడా లేని చిన్న గదిలో విజయ్ తల్లిదండ్రులు నివాసం ఉండేవారు. అతడికి ఏడేళ్లు వచ్చేవరకు ఆర్థికంగా సతమతమవుతూనే ఉండేది ఆ కుటుంబం. ఆ తర్వాతే విజయ్ తల్లిదండ్రులు విజయ్‌కాంత్‌తో ‘చట్టం ఒరు ఇరుట్టరై’ తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వీరు ఆర్థికంగా స్థిరపడ్డారు.
అందుకే మౌనంగా..
విజయ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ ఆట పట్టించేవాడు. కానీ, ఆయన సోదరి మరణం విజయ్ జీవితాన్ని మార్చేసింది. తన చెల్లి విద్య అంటే విజయ్‌కు ప్రాణం. ఆమె చనిపోయిన తర్వాత విజయ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. నేటికీ ఆయన తెరపై అంత ఎనర్జీతో కనిపిస్తున్నా.. బయట మాత్రం చాలా మితభాషిగా ఉండటానికి ఆనాటి విషాదమే కారణమని విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెబుతుంటారు.
అప్పు చేసి తొలి సినిమా.
చిన్నప్పటి నుంచి తండ్రిని చూసిన విజయ్ దృష్టి సినిమాల వైపు మళ్లింది. కానీ, ‘మీవాడు హీరో ఏంటండీ, అసలు నటుడిగానే పనికిరాడు… బండమొహం వాడిది!’ అంటూ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో రూ.60లక్షలు అప్పు చేసి విజయ్ తండ్రే దర్శకుడిగా ఆయనతో సినిమా తీశారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
మొదటి ప్రయత్నంలో నిరాశే..
ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కు తొలి ప్రయత్నంలో నిరాశే ఎదురైంది. తొలి సినిమా ‘నాళయ తీర్పు’ ఫ్లాప్. రెండు నెలలు కనీసం ఫ్రెండ్స్‌ను కలవడానికి కూడా విజయ్ బయటకు వెళ్లలేదు. చివరకు ఆ స్నేహితులే విజయ్‌కు అండగా నిలబడ్డారు. ఆయనలో ధైర్యం నింపారు.
విమర్శించిన వాళ్లే శెభాష్ అనేలా..
తనను తాను నిరూపించుకోవాలనుకున్న విజయ్.. డ్యాన్స్ పైన కసరత్తు మొదలుపెట్టాడు. కరాటే నేర్చుకున్నాడు. పగలూ, రాత్రీ ఇంకే ధ్యాసా లేకుండా సాధన చేశాడు. ఆ తర్వాత సరికొత్త విజయ్‌గా ‘రసిగన్’ అనే సినిమా చేశాడు. 1994లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒకప్పుడు విమర్శించినవాళ్లే.. శెభాష్ అంటూ మెచ్చుకున్నారు.
దళపతి విజయ్..
1990 చివర్లో, 2000 ప్రారంభంలో విజయ్ సినీరంగాన్ని శాసించారు. ‘ఖుషి’, ‘గిల్లి’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. అప్పుడే అందరూ విజయ్ను ‘ఇళయ దళపతి’ అని పిలవడం ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ పేరు దళపతిగా మారింది. విజయ్ నటించిన ‘అదిరింది’, ‘సర్కార్’, ‘విజిల్’, ‘మాస్టర్’ వంటి సినిమాలు ఆయన్ని ప్రేక్షకులకు మరింతగా చేరువ చేశాయి.
కాలికి చెప్పులా ఉంటా..: విజయ్
ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న విజయ్.. వారికి సేవ చేయాలని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2024 ఫిబ్రవరి 2న ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే ) స్థాపించారు. ఈ పార్టీ ప్రారంభించాక ‘లియో’ ఆడియో రిలీజ్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు అభిమానులంటే ఎంత ప్రేమో తెలియజేశాయి. ‘నాపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలికి చెప్పులా ఉండటానికి కూడా వెనకాడను. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకుండా అందరూ ఓపికగా ఉండండి. విజయాన్ని అందుకోవచ్చు’ అన్నారు. నాడు చెప్పినట్లు గానే నేడు విజయాన్ని అందుకున్నారు.
