హైదరాబాద్, మే 10,
(జే ఎస్ డి ఎం న్యూస్):
నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని పలువురు కొనియాడారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో 300వ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల ద్వారా సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయులను మరియు సంచార జాతుల వారిని గుర్తించి వారికి కడుపునిండా భోజనాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం, ఆకలితో బాధపడుతున్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి కనీస సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పావని.ఓ, సేవసభ్యులు అఖిల్ తదితరులు పాల్గొని స్వయంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. అనాథల పట్ల మానవత్వంతో స్పందిస్తున్న స్కై ఫౌండేషన్ సభ్యులను స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

