హైదరాబాద్ మే 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే మహిళల సమస్యల పై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా లైంగిక వేధింపుల బాధితురాలైన ఓ విద్యార్థిని విద్యకు ఆటంకం కలగకుండా ఆమె తీసుకున్న చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. అనారోగ్య కారణాల వల్ల ఇంజినీరింగ్ మూడో సంవత్సరం తరగతులకు గైర్హాజరైన విద్యార్థినిని, హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో కళాశాల యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న విజయలక్ష్మి వెంటనే జేఎన్టీయూ అధికారులతో మాట్లాడారు. ఆ విద్యార్థిని ఎదుర్కొన్న వేధింపులు, ఆరోగ్య పరిస్థితులను వివరించి, మానవతా దృక్పథంతో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే వార్తా కథనాలపై విజయలక్ష్మి తక్షణమే స్పందించారు. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. ఆమె ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆస్పత్రిలో తలెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించారు. మహిళా రోగులకు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు, సౌకర్యాలు అందేలా చూస్తామని అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టకముందే మహిళల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం విజయలక్ష్మి చూపుతున్న చొరవ మహిళా లోకంలో ధైర్యాన్ని నింపుతోంది.
