ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలు మండలం దసరాజుపల్లి గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ( ఎం.ఎస్.ఎం.ఈ) పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ.దామచర్ల జనార్ధన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో స్థానికులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండో సోల్, జిందాల్ వంటి పెద్ద పరిశ్రమల రాకతో పారిశ్రామికీకరణ వేగం పుంజుకున్నట్లు చెప్పారు. వీటికి అనుబంధ పరిశ్రమలు కూడా వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటి అవసరాలు తీర్చేలా ఎం.ఎస్.ఎం.ఈ. పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎం.ఎస్.ఎం.ఈ. పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 38 నియోజకవర్గాలలో వీటిని ఏర్పాటు చేస్తుండగా, ఇందులో ఒంగోలు, కందుకూరు నియోజక వర్గాలు కూడా ఉన్నట్లు తెలిపారు. కందుకూరుకు సంబంధించి అయ్యవారిపల్లిలో 100 ఎకరాలలో, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి దశరాజుపల్లిలో 5 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దసరాజు పల్లిలో ఈ పార్కుకు అవసరమైన రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలను రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ దిశగా కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలుతో ఈ గ్రామానికి అనుసంధానమైన రోడ్లను విస్తరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దశరాజు పల్లి గ్రామంలో ఇప్పటికే దాదాపు కోటి 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. స్థానికుల సూచన మేరకు కరవది, వలేటివారిపాలెం గ్రామాలకు కూడా అనుసంధానం పెంచుతామన్నారు. అన్ని మౌలిక వసతులను ఈ పార్కులో కల్పిస్తామని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు స్థానికులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 38 ఎం.ఎస్.ఎం.ఈ. పార్కులకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి శంకుస్థాపన చేసి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించగా దసరాజుపల్లిలో ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మదన్, ఆర్టీవో చంద్రశేఖర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.




