వాగ్దేవి పాఠశాలలో డ్రగ్స్ నివారణ, ట్రాఫిక్ భద్రతపై అవగాహన సదస్సు

బేగంపేట్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టివోలీ సమీపంలో గల వాగ్దేవి పాఠశాలలో గురువారం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు మల్కాజిగిరి కమిషనరేట్ త్రిముల్గిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల మహమ్మారి వల్ల యువత, వారి కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయో వివరించారు. విద్యార్థి దశ నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, ఇంట్లో వారు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించేలా విద్యార్థులే చొరవ చూపి అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులు తాము మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *