సికింద్రాబాద్:పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన మందులను చౌకగా అందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ మినీ ఆడిటోరియంలో ‘జెనరిక్స్ ఫర్ ఆల్’ సదస్సు విజయవంతంగా జరిగింది. వారధి ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ సదస్సులో వైద్య రంగ ప్రముఖులు, ఫార్మా నిపుణులు, విధాన నిర్ణేతలు, వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన, విశ్వసనీయత పెంచడం ద్వారా రోగుల జేబులకు భారాన్ని తగ్గించవచ్చని సదస్సు అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ఇందిర, ఎం. ఆనందం అండ్ కో డైరెక్టర్ ఎం. రవీంద్ర విక్రమ్ ప్రసంగిస్తూ.. వైద్యం అనేది కొద్దిమందికే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే ప్రాథమిక హక్కు కావాలని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు, కాబోయే వైద్యులు జెనరిక్ మందుల నాణ్యత, వాటి ప్రాధాన్యతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రోగుల సంక్షేమం కోసం జెనరిక్ ప్రిస్క్రిప్షన్లను ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు.
సదస్సులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈఓ దీపక్ సప్రా, నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్ క్రలేటి, ప్రముఖ ఫార్మా రంగ నిపుణులు వరుణ్ విహార్, శివకుమార్ బాలకృష్ణన్, గాంధీ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ జలగం తిరుపతిరావు, యశోద హాస్పిటల్ ఆంకాలజీ హెచ్ ఓ డి ప్రొఫెసర్ సుధా సిన్హా పాల్గొని జెనరిక్ మందుల సమర్థతపై సుదీర్ఘంగా చర్చించారు. దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను మరింతగా విస్తరించాలని, జెనరిక్ మందుల వాడకాన్ని తప్పనిసరి చేసేలా తగిన పాలసీలు తీసుకురావాలని నిపుణులు సూచించారు. వారధి ట్రస్ట్ చైర్మన్ కట్టమూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆరోగ్య శాఖ సహకారంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ‘వారధి జెనరిక్ అవుట్‌లెట్లను’ ఏర్పాటు చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.

