దివ్యాంగులుఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి లక్ష్యసాధన దిశగా దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు-అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు – అందజేత ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ మాగుంట దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి

   
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి లక్ష్యసాధన దిశగా దృష్టి సారించాలని దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, ఇతర ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి తో కలిసి ఆయన పాల్గొన్నారు. మొత్తం 309 మంది లబ్ధిదారులకు రూ.79.59 లక్షల విలువైన 443 ఉపకారణాలను ఈ కార్యక్రమంలో వారు పంపిణీ చేశారు.
              ఈ సందర్భంగా కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ‘ ఇంద్రధనస్సు ‘ పేరుతో వివిధ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాటరీ ట్రై సైకిళ్లు, మాన్యువల్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి పరికరాలు, ఊత కర్రలు ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులు ఎవరైనా ఇంకా ఉంటే మరో విడతలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన దివ్యాంగ అభ్యర్థులతో ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు.
            ఎంపీ మాట్లాడుతూ అలింకో సహకారంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రూ.2.25 కోట్ల విలువైన ఉపకారణాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో దర్శి నియోజకవర్గంలోనే సుమారు రూ.80 లక్షల విలువైన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులలో మనోధైర్యాన్ని పెంచేలా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో బ్యాటరీ ట్రై సైకిల్ విలువ రూ.45 వేల రూపాయలుగా తెలిపారు. ఈ విడతలో 143 బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధంగా సహకారం అందించిన కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి ప్రాంతవాసుల రైలు కల కూడా త్వరలోనే నెరవేరుతుందన్నారు. గుంటూరు – కనిగిరి మధ్య ఈ నెలలోనే ‘ డెము ‘ రైలు ప్రయాణిస్తుందని కేంద్రమంత్రి చెప్పినట్లు ఎంపీ తెలిపారు.
     దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్       గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. గతంలో రూ.3వేలుగా ఉన్న పెన్షన్ ను రూ.6వేలకు పెంచడంతోపాటు వారి సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందంటూ వాటిని ఉదాహరించారు.
                దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త మాట్లాడుతూ లబ్ధిదారులను గుర్తించేందుకు గత ఏడాది జనవరి 30వ తేదీన దర్శి నియోజకవర్గంలో ప్రత్యేక క్యాంపును నిర్వహించామన్నారు. అలింకో సంస్థ ద్వారా ఈ ఉపకారణాలను పంపిణీ చేసేలా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిరంతరం పర్యవేక్షించారని కృతజ్ఞతలు తెలిపారు.
                   ఈ కార్యక్రమంలో ఆర్డిఓ విజయ జ్యోతి,
దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గడిపూటి నారాయణ స్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగవేణి, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, స్థానిక ప్రముఖులు కడియాల లలిత్ సాగర్, ఇతర అధికారులు, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు. తమకు సహాయ ఉపకరణాలు లభించడంపై దివ్యంగుల సంఘాల నాయకులు ఈ సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులందరికీ అధికారులు భోజనాలు ఏర్పాటు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *