తాళ్లూరు మండల సీనియర్ టిడిపి నాయకుడు ఇడమకంటి వెంకట రెడ్డి కుటుంబాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం పరామర్శించారు. ఆయన కుమారుడు యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో విషయం తెలిసిన మంత్రి ఆ సమయంలో రాలేక పోవటంతో తాళ్లూరు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి వచ్చిన మంత్రి తాళ్లూరులో వారి కుటుంబానికి ప్రత్యేకంగా వెళ్లారు. అతి చిన్న వయస్సులో మృతి చెందటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసారు. నిత్యం పార్టీ పనులతో ప్రజల సమస్యలపై పలు మార్లు కలిసే వారని గుర్తు చేసుకున్నారు. నాడు దివంగత నేత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంత రావు నుండి నేటి వరకు తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వెంకట రెడ్డి గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస రెడ్డి భార్య ప్రశాంతితో మాట్లాడిన మంత్రి ధైర్యంగా ఉండాలని, తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులు ఇడమకంటి సుబ్బా రెడ్డి, విజయలక్ష్మి లకు ధైర్యం చెప్పారు. శ్రీనివాస రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. మాజీనర్పంచి నరసింహా రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

