సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని, అక్షరాస్యత ఉద్యమకారిణి ఆకర్షణ సతీష్ (15) భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘హైదరాబాద్ విమోచన దినోత్సవ’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతితో ఆమె సుమారు 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘ది ఓపెన్ లైబ్రరీస్’ వ్యవస్థాపకురాలైన ఆకర్షణ, సమాజంలో పఠనాసక్తిని పెంచేందుకు ఇప్పటివరకు 19,000కు పైగా పుస్తకాలతో 25 గ్రంథాలయాలను ఏర్పాటు చేసిన తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.
చిన్న వయసులోనే అక్షరాస్యత విస్తరణ కోసం ఆకర్షణ చూపుతున్న అంకితభావాన్ని ఉపరాష్ట్రపతి కొనియాడారు. సమాజానికి సేవ చేస్తూనే, భవిష్యత్తులో తాను ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నతంగా రాణించాలని, లైబ్రరీల ఏర్పాటును నిరంతరం కొనసాగించాలని ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే గ్రంథాలయాల ఏర్పాటును చేపట్టిన ఆకర్షణ, ఇటీవల తన 25వ ఓపెన్ లైబ్రరీని న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ & రెఫరల్)లో సాయుధ దళాల కుటుంబాల కోసం ప్రారంభించారు. తనపై నమ్మకంతో విలువైన సమయం కేటాయించిన ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఆకర్షణ, ఈ భేటీ తన బాధ్యతను మరింత పెంచిందని, మరింత మంది చిన్నారులకు పుస్తకాలను చేరువ చేసేందుకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
