వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ప్రభుత్వ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటేలా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగానే ప్రతి పాఠశాల, హాస్టల్ కు ప్రత్యేక అధికారిని కేటాయిస్తూ ‘ వన్ ఆఫీసర్ – వన్ ఇన్స్టిట్యూట్ ‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. గురువారం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండలాలలోని అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. వచ్చే ఏడాది అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఇప్పటినుంచి ప్రత్యేక అధికారులు దృష్టి సారించాల్సి ఉందన్నారు. అధికారిగానే కాకుండా తల్లిదండ్రులుగా ఆలోచించి, ప్రభుత్వ సంస్థలలో చదువుతున్న విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించి, నైతిక బాధ్యతతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల విద్యార్థులలో స్ఫూర్తిని నింపేలా వారితో మాట్లాడాలన్నారు. ఆయా సంస్థలలో ఏమైనా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రతి శనివారం ‘ నో బ్యాగ్ డే ‘ నిర్వహిస్తున్నందున వివిధ అంశాలపై విద్యార్థులలో అవగాహన పెరిగేలా ‘ యువసాథీ ‘ కార్యక్రమం క్రింద చర్చా వేదికలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఈవో సివి రేణుక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.

