కొండేపి నియోజకవర్గం, టంగుటూరు మండలం, తూర్పు నాయుడు పాలెం గ్రామంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు లతో కలిసి మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
గ్రామంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నవీకరించిన చెరువు సుందరీకరణ పనులతో పాటు, రూ. 3.35 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రులు లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడంతో పాటు భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు రూ. 50 లక్షలతో చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేశామని, గ్రామంలో రవాణా సౌకర్యాలను సుగమం చేసేందుకు రూ. 3.35 కోట్లతో సీసీ రోడ్లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్ర పరికరాలను సకాలంలో తలుపు తట్టి అందిస్తున్నామని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టుల పునరుద్ధరణ ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని, పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ రైతులకు అడుగడుగునా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కళ్ళుగా వేగంగా పరుగులు తీస్తున్నాయని వివరించారు. ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగమైన ‘తల్లికి వందనం’, ‘దీపం 2.0’ పథకాల ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, వంటి సంక్షేమ ఫలాలను పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే అందిస్తున్నామని తెలిపారు. సామాజిక సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి బకాయిలను విడుదల చేసి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామన్నారు. పింఛన్లను పెంచి అవ్వాతాతలు, దివ్యాంగుల గౌరవాన్ని నిలబెట్టామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, అంతర్గత రహదారుల నిర్మాణం వేగవంతం చేసి ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

