చందవరం బౌద్ధ స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ప్రముఖ వైద్యురాలు, టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి మంగళవారం ఈ స్థూపాన్ని పరిశీలించారు. స్థూపాన్ని వారు ఆసక్తిగా పరిశీలించి ఆసాంతం కలియతిరిగారు. స్థానికులతో ప్రత్యేకంగా ముచ్చటించ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే రెండో ప్రాముఖ్యమైన ఈ స్థూపం ప్రకాశం జిల్లాలో ఉందన్నారు. ఈ చారిత్రక వైభవాన్ని కాపాడి భావితరాలకు తెలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిని పర్యాటకముగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ టూరిస్టులు వచ్చేలా చూస్తామన్నారు. ఇక్కడ ఉన్న శిల్పాలను కూడా భద్రపరుస్తామన్నారు. ఇందుకోసమే బుద్ధిజంపైన ఎంతో అధ్యయనం చేసి, ఆయా విషయాలపై అపార జ్ఞానం కలిగి అమరావతిలో నిర్మించిన బుద్ధుని విగ్రహ రూపకల్పనలోనూ కీలకపాత్ర పోషించిన సాంస్కృతికశాఖ డైరెక్టర్ తో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. దీనిని అభివృద్ధి చేసేందుకు డి.పి.ఆర్. రూపొందించే కన్సల్టెంట్ సంస్థను కూడా తీసుకువచ్చామన్నారు.
మల్లికార్జున మాట్లాడుతూ క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవ శతాబ్దం మధ్య చాలా గొప్ప స్థితిలో ఉన్న ప్రాంతం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కనుగొన్న 150 స్తూపాలలో ఇదే పెద్దదన్నారు. కాశీ నుంచి కాంచీపురం మధ్యలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న ప్రాంతం కావటం, పక్కనే గుండ్లకమ్మ నది ఉండడం వల్ల ఈ స్థూపం ఎంతో ప్రాముఖ్యత కలిగిందన్నారు. విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బౌద్ధమతంపై పలువురు పరిశోధనలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంతో పాటు సమీపంలోని త్రిపురాంతకం ఆలయాన్ని కూడా ఒక సర్క్యూట్ గా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.
గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఈ ప్రాంత చారిత్రక విశిష్టతను కాపాడుకుంటూ పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్న సాంస్కృతిక శాఖ డైరెక్టరుకు, కలెక్టరుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారి వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ జరీనా బేగం, పర్యాటక శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జయదేవ్, ఆర్డిఓ విజయ జ్యోతి కుమారి, డిపిఓ అనుపమ, ఏపీ సీపీడీసీఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, భూగర్భనీటివనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్థానిక అధికారులు ఉన్నారు.




