సెప్టెంబర్ 22,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర గందరగోళానికిగురిచేస్తున్నాయి. రైలు ఒక మార్గంలో ప్రయాణిస్తుంటే, బోగీల్లోని ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల్లో మాత్రం వేరే రూట్‌కు చెందిన స్టేషన్ల పేర్లు
దర్శనమిస్తుండటంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నగరానికి కొత్తగా వచ్చేవారు, వృద్ధులు, మహిళలు ఈ తప్పుడు సమాచారం వల్ల గమ్యస్థానాన్ని గుర్తించలేక తప్పు స్టేషన్లలో దిగిపోతూ ఇబ్బందులు పడుతున్నారు.
రైళ్లలోని ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జీపీఎస్ లేదా రూట్ ప్రోగ్రామింగ్‌లో తలెత్తుతున్న లోపాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే మెట్రోలో ఇలాంటి సమస్యలను కేవలం చిన్న సాంకేతిక లోపంగా వదిలేయకుండా అధికారులు వెంటనే సరిదిద్దాలని,ప్రయాణికులకు ఖచ్చితమైన స్టేషన్ల వివరాలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
