ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి, అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర పరిహారానికి
మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఈ వర్గాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారికి కూడా త్వరగా శిక్ష పడేలా విచారణలు వేగవంతం చేయాలన్నారు. గురువారం ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధ్యక్షత ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రితో పాటు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ ఈ సందర్భంగా నివేదించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1756 మంది బాధితులకు రూ.14.24 కోట్లకు పైగా పరిహారం అందించామన్నారు. ఇందులో పాత బకాయిలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో 58 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 9 కేసులు కోర్టులలో విచారణలో ఉన్నట్లు చెప్పారు. మిగతావి ఛార్జ్ షీటు దాఖలు చేసే స్థితిలో ఉన్నట్లు వివరించారు. కేసుల విచారణ త్వరగా ముగిసి దోషులకు కఠిన శిక్షలు పడేలా పోలీసులు, కోర్టుల స్థాయిలో విచారణ వేగవంతం చేయాలని మంత్రి చెప్పారు. పౌరహక్కుల దినోత్సవం కూడా మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గస్థాయిలో నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఆయా సమావేశాలకు హాస్టల్ వార్డెన్లు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు కూడా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 600 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కార్పొరేట్ సంస్థలతో బోధన అందిస్తున్నామని, తద్వారా ఐఐటి, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఒంగోలులో అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా జర్మన్, ఇజ్రాయిల్ భాషలలో కూడా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, యుపిఎస్సి పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ స్మశాన స్థలాల సమస్య ఉన్న గ్రామాలకు అందుబాటులోని ప్రభుత్వ స్థలాలను నెల రోజుల్లోగా కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కుల ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లో త్వరగా వచ్చేలా చూస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిటీ హాల్స్ కూడా త్వరగా నిర్మించేలా చూస్తామన్నారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు పరిహారం చెల్లింపులో ఎలాంటి పెండింగ్ లేదన్నారు. బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల స్థాయిలో దర్యాప్తు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుల దర్యాప్తు, దోషులకు శిక్షలు పడుతున్న తీరుపరంగా రాష్ట్రంలో టాప్ -5 జిల్లాలలో ప్రకాశం ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకురావాలని ఎస్పి సూచించారు.
ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో విలీనమైన నేపథ్యంలో తమ ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా స్మశాన స్థలాల సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. కొన్నిచోట్ల దారి సమస్య కూడా ఉందన్నారు. వీటిపై దృష్టి సారించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డిఆర్డిఏ పిడి నారాయణ, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు పల్లె మనీందర్ దేవ్, మొలతోటి గురవయ్య, పొన్నర్సు సునీత, యనమద్ని వెంకటేశ్వర్లు, కత్తి అన్నోజీ రావు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు గంగవరపు శ్యామ్ సుందర్, షేక్ మహమ్మద్ ఖాసిం పాల్గొన్నారు.




