తాడేపల్లి:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణం పట్ల వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రాజశేఖర్‌తో తమ ఉన్న అనుబంధాన్ని, పార్టీ కోసం ఆయన అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నిన్నగాక మొన్న జరిగిన డీఎస్సి నియామకాల అక్రమాలపై జరిగిన ఆందోళనల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకుడిని కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా తమకు తీరని లోటని పలువురు నాయకులు అభిప్రాయ పడ్డారు.
రాజశేఖర్ మరణం పార్టీకి, ముఖ్యంగా ఎస్సీ, ప్రచార విభాగాలకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన, ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రతిక్షణం నిబద్ధతతో పని చేసిన నాయకుడిగా రాజశేఖర్ సేనానిలా వ్యవహరించారని నేతలు ప్రశంసించారు. ఆయన ఆకస్మిక మరణవార్తతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖర్ ఆకస్మిక మరణం గురించి తెలుసుకున్న పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు నేతలు తెలిపారు. త్వరలోనే ఆయన కుటుంబ సభ్యులను నేరుగా కలుసుకుని పరామర్శించనున్నట్లు వెల్లడించారు. రాజశేఖర్ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, రాష్ట్ర భూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి తదితరులు పాల్గొని రాజశేఖర్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు ఒక నిమిషం మౌనం పాటించారు. రాజశేఖర్ పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి ఒంగోలుకు తరలించనున్నట్లు, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.

