పల్లెలు.. పట్టణాలు మరింత ‘పవర్‌ఫుల్‌’ఆర్డీఎస్‌ఎస్‌ పనులు 70 శాతం పూర్తిజిల్లాలో మరో 7 సబ్ స్టేషన్లువిద్యుత్‌ మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యం: మంత్రి గొట్టిపాటి

ఒంగోలు: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, విద్యుత్‌ స్తంభాలు, కొత్త లైన్ల ఏర్పాటు, పాత కండక్టర్ల మార్పు వంటి పనులతో పల్లెలు, పట్టణాల్లో విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నంలో రూ.44.25 కోట్లతో నిర్మించిన 132/33 కేవీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తపట్నం సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో వ్యవసాయం, గృహ, పారిశ్రామిక, వాణిజ్య, ఆక్వా రంగాలకు చెందిన 22,430 మంది వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందనుందని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ మౌలిక వసతుల విస్తరణ చేపడుతున్నామని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆర్డీఎస్‌ఎస్‌ పనులు 70 శాతం పూర్తి
ప్రకాశం జిల్లాలో ఆర్డీఎస్‌ఎస్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. జిల్లాలోని 307 ఫీడర్లకు గాను 213 ఫీడర్ల పనులు పూర్తయ్యాయని, ఇందుకోసం రూ.366 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 2,950 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామని, మరో 446 మంది రైతులకు త్వరలో కనెక్షన్లు అందిస్తామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

సూర్యఘర్‌లో ఏపీని నంబర్‌ వన్‌ చేస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలతో అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రకాశం జిల్లాలో 26,609 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన సోలార్‌ కనెక్షన్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పీఎం సూర్యఘర్‌ సోలార్‌ కనెక్షన్లలో ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

ప్రకాశంలో మరో 7 సబ్‌స్టేషన్లు
సీపీడీసీఎల్‌ పరిధిలో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 11 సబ్‌స్టేషన్లు నిర్మించామని, మరో 7 నిర్మాణంలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట కొత్త విద్యుత్‌ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు పాత కండక్టర్లను మారుస్తున్నామని చెప్పారు.

‘వైసీపీ నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు పెండింగ్‌’
2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు స్థలాలు, నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు చేపట్టలేదన్నారు. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి వేసిన శంకుస్థాపన రాళ్లు కూడా అలాగే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేస్తోందన్నారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నప్పటికీ ప్రజలపై అదనపు భారం మోపడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు.

290 మిలియన్‌ యూనిట్లకు పెరిగిన డిమాండ్‌
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో 265 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న రోజువారీ అవసరం ప్రస్తుతం 290 మిలియన్‌ యూనిట్లకు చేరిందన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జెన్‌కో ద్వారా ఉత్పత్తిని పెంచడంతో పాటు అవసరమైన విద్యుత్‌ను ఇతర మార్గాల్లో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
డిమాండ్‌ ఎంత పెరిగినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి, విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం
ఒంగోలులో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, డ్రోన్‌ టెక్నాలజీలో నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వేదికగా ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సభా వేదిక, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, జిల్లా కలెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *