పురపాలక ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తదుపరి అధికారులతో సమావేశం అయ్యారు.
పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ఉండరాదని సూచించారు. ఎన్నికల నిర్వహణకు నాలుగు జోన్ లుగా విభజించిన నేపథ్యంలో జోనల్ అధికారులను నియమించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో చురుగ్గా, నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. 62 వార్డులు ఉండగా, 21 రూట్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఎం సి సి కమిటీని శుక్రవారం నియమించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి అన్ని కమిటీలకు సమర్థులైన అధికారులను నియమించాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 62 డివిజన్లు ఉండగా తొలి రోజు నామినేషన్ ప్రక్రియపై కలెక్టర్ ఆరా తీశారు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి మొదటిరోజు ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని కమిషనర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వార్డు మెంబర్ కు ఒక నామినేషన్ దాఖలు అయ్యిందని వివరించారు. తదుపరి రిటర్నింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు.
ఆయన వెంట ఒంగోలు ఆర్డీవో టి.చంద్రశేఖర్, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: