బేగంపేట నవంబర్ 27,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
బేగంపేట మయూరి మార్గ్‌లోని ఒక ప్రైవేటు లేడీస్ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరంచదువుకుంటున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన తిప్పనపల్లి సుదర్శన్ కుమార్తెలు సుస్మిత (22), హర్షిత (19) చదువు నిమిత్తం ఈ ఏడాది జులైలో హైదరాబాద్‌కు వచ్చారు. వీరిద్దరూ బేగంపేట మయూరి మార్గ్‌లోని శ్రీ శ్రావణి లేడీస్ హాస్టల్‌లో ఉంటూచదువుకుంటున్నారు. హర్షిత బేగంపేట ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ నెల 26వ తేదీ ఉదయం 7.45 గంటల సమయంలో అక్క సుస్మిత కాలేజీకి వెళ్లగా, చెల్లెలు హర్షిత హాస్టల్ గదిలోనే ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సుస్మిత తిరిగి గదికి వచ్చి చూడగా హర్షిత కనిపించలేదు. మంచంపై ఒక లేఖ రాసి పెట్టి అదృశ్యమైనట్లు గుర్తించింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. హర్షిత ఫోన్‌కు కాల్ చేయగా మొదట రింగ్ అయినప్పటికీ లిఫ్ట్ చేయలేదని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ (ఔట్ ఆఫ్ నెట్‌వర్క్) వచ్చిందని సుస్మిత తెలిపింది.
దీంతో ఆందోళనకు గురైన సుస్మిత గురువారం మధ్యాహ్నం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.అదృశ్యమైన హర్షిత 5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉందని, ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు యాష్ కలర్ టాప్, నలుపు రంగు లెగ్గిన్, నలుపు రంగు స్కార్ఫ్ ధరించి ఉందని పోలీసులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలదని పేర్కొన్నారు. సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట ఏఎస్సై కె. నర్సింహులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ తెలిసిన వారు బేగంపేట పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: