శ్రీ వేంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీగిరి గిరి ప్రదక్షిణ శోభాయమానంగా జరిగింది. శ్రీవారి నామస్మరణతో శ్రీగిరి వీధులు మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం 6 గంటలకు శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గో సంఘం గోశాల వద్ద నుండి గిరి ప్రదక్షిణ కు బయలుదేరారు. తొలిగా గోపూజను నిర్వహించి తేరు పై ఇరు దేవేరులతో స్వామివారు ప్రతిమ ఉంచి, నేత్రపర్వముగా పూలతో అలంకరించి, గరుడ, హనుమాన్, శంకు, చక్ర, నామాలను స్వామివారి ఉత్సవ మూర్తి మరియు రామాయణము, భగవద్గీత పుస్తకములను పట్టుకొని భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ… కోర్టు సెంటర్, గ్రంథాలయం, కేశవ స్వామి పేట, భగీరథ సెంటర్, వేప అంకమ్మ తల్లి ఆలయం, గద్దలగుంట మీదుగా శ్రీగిరి పై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడానికి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. భగీరథ మందిరం వద్ద సగర పుత్రులు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పాల ప్రసాదం అందించారు.
ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యాం మాట్లాడుతూ భక్తులు స్వామివారి నామస్మరణతో సామూహిక గిరి ప్రదక్షణ చేయడం వల్ల పరిసరాలలోని నకారాత్మక శక్తులన్నీ నశించడమే కాకుండా ఆధ్యాత్మిక భావనలు ద్విగుణీకృతమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న భక్తులు పలువురు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, గత సంవత్సరం శ్రీగిరి గిరిప్లదక్షిణ ప్రారంభించారని, గిరి ప్రదక్షిణ లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఒంగోలు నగర వాసులుగా మేము అత్యంత అద్వితీయమైన ఆధ్యాత్మిక భావనలను పొందామని తెలిపారు.
శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కోశాధికారి వలేటి కృష్ణారావు, సభ్యులు చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామునాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు లు కార్యనిర్వహణ చేశారు.




