అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున సామూహికంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ చేసి స్వామి వారి సన్నిధి చేరి ఆశీస్సులు పొందే అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీగిరి గిరి ప్రదక్షిణ. ప్రతినెల శ్రవణా నక్షత్రం రోజున ఉదయం ఐదు గంటలకు శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గో సంఘం (గోశాల) వద్ద నుండి వందలాది మంది భక్తులు గోవింద నామాలు చదువుకుంటూ స్థానిక గ్రంథాలయము, కేశవ స్వామి పేట, భగీరథ మహర్షి మందిర సెంటర్ నుండి శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట దాటి తదుపరి గోశాల ముందుగా శ్రీగిరి చేరి స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతున్నది.
ఆశ్వీజ మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం గోసంఘం చేరిన భక్తులు జోరు వానలో సైతం గిరి ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి తో విస్తారంగా కురుస్తున్న వానలలో సైతం భక్తులు గిరిప్రదక్షిణ చేయడం శ్రీవారిపై భక్తులకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలను సూచిస్తుందని తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో గోమాత ముందునడుగుగా… గరుడ హనుమాన్ శంఖు చక్ర నామాలు చేతబట్టి భజంత్రీలు మోగుతుండగా… గోవింద నామాలు పఠిస్తూ భక్తులు గిరి ప్రదక్షణ పూర్తి చేసి శ్రీగిరి పై కొలువైన శ్రీనివాసుని దర్శించి అలౌకిక ఆధ్యాత్మిక భావనలలో ఓలలాడారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు ధనిశెట్టి రామునాయుడు తదితరులు నిర్వహణ చేశారు.



