జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పొందే విషయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా అన్ని విధాల సహకరించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, గ్యాస్ పంపిణీ దారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి వివిధ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకం కింద అర్హులైన పేద కుటుంబాల వారికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందచేయుటకు ఈనెల 31వ తేదీ నుండి శ్రీకారం చుట్టనుందన్నారు. జిల్లాలో మొత్తం 49 గ్యాస్ ఏజెన్సీ లు ఉండగా, 6,82,437 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ పథకం కింద ఎల్పిజి కనెక్షన్, ఆధార్ నంబరు, బియ్యపు కార్డు, ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు కలిగి ఉన్నవారు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పొందుటకు అర్హులని, ఈ పథకము దీపావళి పండుగ పురస్కరించుకొని ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభమవుతుందన్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందగోరు లబ్ధిదారులు వారి గ్యాస్ ఏజెన్సీ నందు గ్యాస్ కోసం బుకింగ్ చేసుకుని గ్యాస్ ధరను గ్యాస్ ఏజెన్సీ వారికి పూర్తిగా మొదట చెల్లించవలసి ఉంటుందని, ఆ తరువాత అర్హులైన లబ్ధిదారులకు వారు గ్యాస్ ఏజెన్సీ వారికి చెల్లించిన పైకం మొత్తము తిరిగి 2 రోజులలో వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా డిబిటి పద్ధతిలో జమ చేయబడుతుందన్నారు.
ఈ పథకం కింద మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందగోరు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీ నుండి వచ్చే 2025 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు వారి గ్యాస్ ఏజెన్సీ వద్ద బుకింగ్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. ఆ విధంగా వారికి గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి 5 నెలలపాటు సమయం ఉంటుందన్నారు. మొదటి ఉచిత సిలిండర్‌ను బుకింగ్ చేసిన 24 నుండి 48 గంటల్లో లబ్ధిదారులకు సరఫరా చేయవలసి ఉంటుందన్నారు. గ్యాస్ ఏజెన్సీ ల వద్దకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాస్ బుకింగ్ కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంయమనం పాటించాలని, 5 నెలల సమయం ఉంటుందని వివరించాలన్నారు. ప్రతి రోజు ఎంతమంది గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేసుకున్నారో వారి వివరాలను రోజువారి నివేదికలో పొందుపరిచి పంపాలన్నారు. ఈ పథకంపై ఏమైనా అభ్యంతరాలు గాని,సూచనలు గాని, సమస్యలు గానీ ఉంటే టోల్ ఫ్రీ నెంబరు 1967కు ఫోన్ చేసి తెలపవచ్చన్నారు.
పేద ప్రజలకు ఆర్థికంగా మేలు చేకూర్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకమును లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత ఉన్న లబ్దిదారుల్లో ఇంకా ఈకేవైసి చేసుకోనని వారుంటే వెంటనే ఈకేవైసి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, ఐ ఓ సి ఎల్ నోడల్ అధికారి భాస్కర్ రావు, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ గ్యాస్ ఏజెన్సీ వారు పాల్గొన్నారు.

