ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమకు రెండు కళ్లు లాంటివారని ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయకులు, సంగీతదర్శకులు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. తనకు ఇంత పేరు ప్రతిష్టలు రావటానికి కారణమైన తన తండ్రి సమానులు, గురువు అయిన ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు చలువేనని వినయంగా చెప్పుకున్నారు. ఒంగోలు తనకు కళాకారుడిగా జన్మనిచ్చిందని, ఎక్కడో మారుమూల ఉన్న తనను చేరదీసి ఈ స్థాయికి తీసుకొచ్చిన అన్న నెల్లూరి వెంకటేశ్వర్లు రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తాను ఏస్థాయిలో ఉన్నా ఒంగోలును మర్చిపోలేనని అన్నారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్ 2025 ఒంగోలులో తీసుకోవటం ఆనందాన్ని కలిగించిందన్నారు.
అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో సీవీఎన్ రీడింగ్ రూమ్‌లో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సభలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యకుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వందేమాతరం శ్రీనివాస్ చిన్నతనం నుంచే మంచి “గాయకుడని, అతను ఎంతో కష్టపడి తనకంటూ చిత్రసీమలో ఒక స్థానాన్ని పొందటం తనకే కాకుండా జిల్లాకు కూడా గర్వకారణమని అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటలు ఉత్తేజాన్నిస్తాయని అన్నారు. ఒంగోలులో సంగీత నృత్య అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తున్నామని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్‌రావు మాట్లాడుతూ ఒంగోలు కళలకు, కళాకారులకు పుట్టినిల్లని అటువంటి ఒంగోలు గడ్డమీద చదివి నేడు తెలుగుచిత్ర సీమలో ప్రముఖ స్థానాన్ని పొందిన వ్యక్తి వందేమాతరం శ్రీనివాస్ అని అన్నారు. గతంలో కళాకారులకోసం ఎన్. టి.ఆర్. కళాక్షేత్రం నిర్మిచామని అన్నారు. ఎక్కువమంది ప్రేక్షకులు పాల్గొనే విధంగా పెద్ద ఆడిటోరియం నిర్మిస్తామని అన్నారు.
ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య,
పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, వందేమాతరం శ్రీనివాస్ ను అభినందించారు.
అనంతరం జరిగిన సంగీత విభావరిలో వందేమాతరం పెళ్ళెప్పుడవుతుంది బాబు పిల్లయాడదొరుకుతుంది బాబు, కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, ఓసేరావులమ్మ, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎన్నియ్యలో పాటలు పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. గాయనీగాయకులు కల్లగుంట కృష్ణయ్య, బాలరాజు, విజయ్ పూర్ణిమ పాడిన అక్కినేని చిత్రాలలోని పాటలు అలరించాయి.

