క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు.గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల్ క్రిష్ణ తో కలసి ఆర్డీఓలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున, క్షేత్ర స్థాయిలో పరిష్కారం కోసం వచ్చిన రెవెన్యూ సమస్యల వివరాలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల వారీగా మండల యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని జిల్లా కలెక్టర్, తహసిల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో, పిజిఆర్ఎస్ లో వచ్చిన రెవెన్యు అంశాలకు సంబంధించిన ఆర్జీల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్ లో వచ్చిన వినతలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఆ సమస్యను పరిశీలించి, పిటిషనదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి మీ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించాలని తెలిపారు. సమస్య పరిష్కారం వీలుకాని పక్షంలో ఏ కారణం చేత పరిష్కారం వీలు కాదో సంబంధిత లబ్దిదారునికి స్పష్టంగా తెలియ చేయాలన్నారు. అంతేకాకుండా సమస్య పరిష్కారం సకాలంలో చూపాలని సూచించారు. రెగ్యులరైజేషన్ స్కీం 2025 ప్రక్రియ పై తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వున్న రెవెన్యూ సమస్యల వివరాలను సంబంధిత తహసిల్దార్ నుండి జిల్లా కలెక్టర్ ఆడిగితెలుసుకున్నారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మిప్రసన్న, జిల్లా లోని అన్నీ మండల తహసిల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.


