ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా అన్ని విధాలా అభివుధ్ధి చెందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ మరియు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ ఎస్. సురేష్ కుమార్అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలను ఈ దిశగా సమర్థంగా అమలు చేసేలా దృష్టి సారించాలని చెప్పారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రకాశం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తనను ప్రత్యేక అధికారిగా నియమించినందున ప్రతి నెలా ఒకటో తేదీ మరియు మూడో శనివారం జిల్లాకు వస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రత్యేక నిర్ణయాలు ఏమైనా వుంటే కలెక్టరు ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పధకాల ప్రయోజనాలు అందుతున్న తీరుపై ఐ.వి. ఆర్.ఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గ్రీవెన్స్, ధాన్యం సేకరణం, దీపం, అన్న క్యాంటీన్, రెవెన్యూ సదస్సులు, విద్య, వైద్యం, సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయం, ఉద్యానవనం, పసుసంవర్ధక, మత్స్య, గనులు, పరిశ్రమలు, రహదారులు, భవనాలు, పారిశుధ్యము-తాగునీరు, పి.ఎం సూర్య ఘర్, డ్వామా , హౌసింగ్, టి డే కో , ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, తదితర అంశాలపై ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. పధకాల ప్రయోజనాలు ప్రజలకు అందడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆయన చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లోనూ, “మీ కోసం” కార్యక్రమాలలోనూ వస్తున్న అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని స్పష్టం చేసారు.
దీనిపై కలెక్టరు స్పందిస్తూ రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు, నిషేధిత జాబితాలోని భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తెసుకోవాల్సిన కేసులు ఉన్నాయన్నారు. మండల స్థాయి నుంచి ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదిస్తున్న క్రమంలో తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ అర్జీలను ప్రజలు రీ ఓపెన్ చేస్తున్నారని ఆమె వివరించారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలను ఆడిట్ చేయడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. తమ శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలను సంబంధిత ఉన్న తాధికారులు కూడా వివరించారు.
దీనిపై సురేష్ కుమార్ స్పందిస్తూ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కలెక్టరు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ దిశగా శాఖల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన ఆదేశించారు. తదుపరి సమావేశంలో ఆయా శాఖల వారీగా సమగ్రంగా సమీక్షిస్తానని చెప్పారు.
ఈ సమావేశం లో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, ఒంగోలు, కనిగిరి ఆర్. డి.ఓ లు లక్ష్మి ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ముందుగా బంగారు బాల్యం కార్యక్రమానికి సంబంధించి ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ను సురేష్ కుమార్ సందర్శించారు. ఈ సెంటర్ ఏర్పాటు నేపధ్యాన్ని, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును కలెక్టరు ఆయనకు వివరించారు.


