దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మెగా యోగ సాధనలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా యోగ పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రాబోయే నెలరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణాల్లో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ యోగేంద్ర కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకనుగుణంగా యోగ సాధన వలన కలుగు ప్రయోజనాలను ప్రజలకు తెలియచేసేలా రాబోయే నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో యోగ సాధన పై అవగాహన కలిగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. యోగను నిత్యం సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందన్నారు. యోగా చేయడం వల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసునని, దాన్ని తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాల్సి ఉందన్నారు. తద్వారా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు వీలుంటుందన్నారు. ఇదే నినాదాన్ని సైతం స్వచ్ఛ్ ఆంధ్ర విజన్- 2047 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాపీ, హెల్ది, వెల్ది సిటిజెన్ లుగా ఉండాలని పేర్కొన్నారన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయ కుమార్ మాట్లాడుతూ… భారత దేశంలో పుట్టిన యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించడం జరిగిందని, అప్పటినుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. యోగా మన శారీరక, మానసిక, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందన్నారు. ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ…. యోగా అంటే అందరికి తెలిసిందే, యోగా వలన మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు అర్ధ గంట పాటు యోగా సాధన చేయడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి ఎంతో సహాయపడుతుందన్నారు.
ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ… యోగాను ప్రపంచానికి తెలియచేసింది భారత దేశమన్నారు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో పదేళ్ల క్రితం గౌరవ ప్రధాని నరేంద్ర మోది యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ మన దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలన్నారు. ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే నెల రోజులు పాటు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ తయారు చేసుకొని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యోగ సాధన చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్నీ వర్గాల ప్రజలు యోగ సాధనలో భాగస్వాములు కావాలన్నారు.
ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగ సాధకులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ యోగాసనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆయుష్ శాఖ ఆర్డిడి పద్మవతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు.









