అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు భారీ సంఖ్యలోభాగస్వాములయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా
దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో బుధవారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యోగా శిక్షణా కేంద్రాలు, మాస్టర్ ట్రైనర్ లకు సంబంధించిన వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తం గా 57 మంది ట్రైనర్స్ ను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా ఆమెకు చెప్పారు.
దీనిపై కలెక్టరు స్పందిస్తూ ఈ నెల 22 నుంచి 27 వ తేదీ వరకు వీరికి మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన శిక్షణ, ఈ మాసోత్సవాల ప్రాధాన్యతను వివరించాలని చెప్పారు. అనంతరం వీరు 28 వ తేదీ నుంచి జూన్ 3 వ తేదీ వరకు మండల స్థాయిలో, 4 నుంచి 6 వ తేదీ వరకు గ్రామ స్థాయిలో సాధారణ ప్రజలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అనంతరం గ్రామ స్థాయి ప్రజలను వివిధ ఇతి వృత్తాలతో యోగాభ్యాసనం లో భాగస్వాములను చేయాలన్నారు. ఇందులో భాగంగా 16వ తేదీన అన్ని తరాలను భాగస్వాములను చేస్తూ కుటుంబ యోగా, 17 వ తేదీ న సీనియర్ సిటిజన్స్ యోగా నిర్వహించాలని చెప్పారు. 18, 19 తేదీలలో గ్రామ స్థాయిలో యోగాసన పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని చెప్పారు.
ఈ సమావేశం లో డి. ఆర్. బి.చిన ఓబులేసు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా ఆయుష్ అధికారి డా. భీమ నాథ్, మెడికల్ ఆఫీసర్ శిరీష, స్కూల్ గేమ్స్ సెక్రటరీ హాజీరా, పతంజలి యోగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు బాలోజీ యోగాచార్య, వివేకానంద యోగా శిక్షణా సంస్థ, ఇతర యోగా శిక్షణా సంస్థ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

