హైదరాబాద్ జూన్ 5(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి):
శాంతి చేర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమానవీయంగా మావోయిస్టులను హత మార్చడం దారుణమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.హింసకు హింస సమాధానం కాదని, ఆపరేషన్ కగార్ పేరుతోమావోయిస్టులతో పాటు అమాయక గిరిజనులను కూడా కాల్చి చంపుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ ను ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తమలాంటి వారు కోరితే అర్బన్ నక్సలైట్స్ అంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆలోచనలు, భావాలు వేరువేరుగా ఉన్నా . మావోయిస్టులు కూడా భారత పౌరులేనని.ప్రజాస్వామ్య బద్ధంగా వారితో శాంతి చర్చలు నిర్వహించేందుకు మోడీ, అమిత్ షాలు స్పందించకపోవడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాలపై ఆధిపత్యం సాధించి వనరులను ఆదానీ, అంబానీ లాంటి వారికి కట్టబెట్టేందుకే ఈ మారణ హోమం కొనసాగిస్తున్నారని విమర్శించారు. దేశంలో అత్యంత సంపన్న పార్టీ బిజెపి అని, 8వేల కోట్లకు పైగా నిధులను ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల నుంచి ఎలక్ట్రోరల్ బ్రాండ్ల రూపంలో తీసుకున్నారన్నారు. అలాంటి వారికి లబ్ధి చేకూర్చడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ అని ఆరోపించారు.ఈ మారణ హోమాన్ని ఆపేందుకు గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్పందించాలన్నారు. సుప్రీంకోర్టు అయినా సుమోటోగా స్వీకరించి ఆపరేషన్ ను నిలిపి వేయించాలని కోరారు.
ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా రాజ్యం రాదని తమ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని పేర్కొన్నారు. గద్దర్ కూడా ఆయుధాలు చేతబట్టి. ఆ తరువాత జనజీవన స్రవంతిలో ప్రజా ఉద్యమాల వైపు నడిచారని గుర్తు చేశారు. అట్టడుగు, పేద వర్గాలకు సమాన హక్కులు, వనరులు దక్కాలని మావోయిస్టులు కోరుకుంటున్నారని, వారేమీ తీవ్రవాదులు కాదన్నారు. పాకిస్తాన్ వాళ్లతో చర్చలు జరిపే మోడీ ప్రభుత్వం.సమ సమాజం కోరుకునే భారత పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ ను ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు, పౌరులు, మేధావులు, బ్యూరోక్రాట్లు ముందుకు రావాలని కోరారు.
సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి , తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

