మెరుగైన విద్యతోపాటు విద్యార్థుల ఆరోగ్యానికీ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ
చెప్పారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా బలవర్ధకమైన సన్నబియ్యంతో ( ఫైన్ క్వాలిటీ ఫోర్టిఫైడ్ రైస్ ) వండిన ఆహారాన్ని గురువారం ఒంగోలులోని డి.ఆర్.ఆర్.ఎం. మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు ఆయన వడ్డించారు. సన్న బియ్యంతో చేసిన ఆహారంతో పాటు పాఠశాలలు పునః ప్రారంభమైన రోజునే విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను కూడా అందించే కార్యక్రమాన్ని పాఠశాలలో పండుగ వాతావరణంలో చేపట్టారు. జాయింట్ కలెక్టర్ తో పాటు ఒంగోలు నగర మేయర్ శ గంగాడ సుజాత, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మెనూలో మార్పులు చేయడంతో పాటు అందించే ఆహారంలో నాణ్యత పైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ క్రమంలో తాజాగా ఫోర్టిఫైడ్ బియ్యంతో వండిన భోజనం పెడుతున్నట్లు చెప్పారు. రేషన్ షాపుల నుంచి కాకుండా నేరుగా మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచే బియ్యం పాఠశాలలకు వస్తాయన్నారు. బియ్యం సంచులపైన ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుందన్నారు. దీనిని స్కాన్ చేయడం ద్వారా ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి?, ఎప్పుడు ప్యాక్ చేశారు ?, తదితర వివరాలు తెలుస్తాయన్నారు. ఈ వివరాల ద్వారా నాణ్యతలో ఏమైనా తేడా అనిపిస్తే తిరిగి వాపస్ చేయవచ్చని చెప్పారు. ప్రజలు కూడా
విద్యార్థి దశ నుంచే మంచి ఆహారపు, జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. వార్తాపత్రికలు చదవడం, యోగాసనాలు సాధన చేయటాన్ని దినచర్యలో భాగంగా పెట్టుకోవాలని చెప్పారు. పట్టుదల, తపన కలిగి ఇష్టంతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఆయా విషయాలలో విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని టీచర్లకు ఆయన
సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 సరస్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అప్పారావు, ఇతర ఉపాధ్యాయులు, భోజనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

