రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు మొత్తాన్నీ కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్ తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పొగాకును వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని చీమకుర్తి, మద్దిపాడు, పామూరు, దొనకొండ, కొత్తపట్నం, ముండ్లమూరు, పొదిలి, తాళ్లూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు వంటి 10 మండలాలలో 1088 మంది రైతులు 4841 ఎకరాల విస్తీర్ణంలో నల్లబర్లీ పొగాకు సాగు చేసినట్లు చెప్పారు. తద్వారా 50,380 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచ్చినట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న నల్లబర్లి పొగాకు మొత్తాన్నీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ ...చరిత్రలో తొలిసారి నల్లబర్లీ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయిస్తున్నట్లు చెప్పారు. హెచ్.డి.ఎం. రకం పొగాకును కిలో రూ.120, హెచ్.డి.ఎక్స్. రకం పొగాకును కిలో రూ.60 చొప్పున అధికారులు కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. తేమ శాతం 20 లోపు ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. మార్క్ ఫెడ్ కు విక్రయించాలనుకునే రైతులు ముందుగా సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తద్వారా రైతులు ఏ రోజు ఏ ప్లాట్ ఫారం వద్దకు పొగాకును తీసుకురావాలో వారి మొబైల్ కు ముందస్తు సందేశం వస్తుందని వివరించారు. ఈ నిబంధనలు పాటించి అధికార యంత్రాంగానికి సహకరించాలని రైతులకు ఆయన సూచించారు. తమది రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమని, పూర్తిస్థాయిలో నల్లబర్లి పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా మార్క్ ఫెడ్ సంస్థ మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్ బాబు, ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణ్ రామ్, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ ఆదిలక్ష్మి, రైతు సంఘాల నాయకులు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.