బంగారు బాల్యం యాప్ ఆధారిత సర్వేను పది రోజుల్లోగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

బంగారు బాల్యం యాప్ ఆధారిత సర్వేను పది రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యల బారిన పడే (వల్నరబుల్ ) చిన్నారుల గుర్తింపుతో పాటు ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్ , బడి వయసు పిల్లలు అందరూ బడిలో ఉండేలా తీసుకోవలసిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
యాప్ లో పొందుపరచిన వివిధ ప్రమాణాల ప్రకారం వల్నరబుల్ చిన్నారుల గుర్తింపు ప్రక్రియను 10 రోజుల్లోగా అన్ని మండలాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్ళలోని విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వల్నరబుల్ పిల్లల వివరాలను ఇందులో నమోదు చేయాలని చెప్పారు. ఇతర ఆవాస ప్రాంతాలలోని ఈ విధమైన పిల్లలను మహిళా సంరక్షణ కార్యదర్శులు గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా తమ పరిధిలో సర్వే పూర్తి అయ్యేలా ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సమన్వయంతో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఈ తరహా పిల్లలను గుర్తించే బాధ్యతను నోడల్ ఆఫీసరుగా ఒక టీచరుకు అప్పగించాలని ఆమె చెప్పారు. ఈ సర్వే పది రోజుల్లో పూర్తి చేయాలని, తర్వాత పది రోజుల్లోగా విద్యార్థులకు ప్రభుత్వం నుంచి, ఇతర దాతల నుంచి అవసరమైన ప్రయోజనం కల్పించేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి తన పరిస్థితిని బట్టి అవసరమైన సహాయం అందేలా ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
అదేవిధంగా ఆధార్ కార్డు లేని ఆరేళ్లలోపు పిల్లలు కూడా ఆధార్ కార్డులు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా ఆధార్ కార్డులు పొందలేకపోతున్న వారిని గుర్తించి, ఈనెల 27వ తేదీన జనన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అర్హులతో దరఖాస్తు చేయించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే జనన ధృవీకరణ పత్రాలు కలిగి ఉన్నవారికి వెంటనే ఆధార్ కార్డులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
బడి వయసు కలిగిన పిల్లలు సుమారు 13వేల మంది ఇప్పటికీ బడి వెలుపల ఉన్నారని, వీరందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే నెల ఒకటి, రెండు, మూడవ తేదీలలో జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ , ఫోక్సో చట్టం, లైంగిక వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. వారికి ఏ విధమైన సహాయం కావాలన్నా 1098 నంబరుకు ఫోన్ చేసే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ విధంగా వారి పుస్తకాలలో ప్రత్యేక స్టాంపు వేసేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెను పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డిఇఓ కిరణ్ కుమార్, ఐసిడిఎస్ పిడి సువర్ణ , డి సి పి ఓ దినేష్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మనాయక్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి , ఒంగోలు ఆర్డీవో లక్ష్మి ప్రసన్న , నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ, ఎంపీడీవోలు, సిడిపివోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు హాజరయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *