మాదకద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ,ప్రకాశం జిల్లా ఎస్పీ .ఏ.ఆర్. దామోదర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ నెల 26వ తేదీ అంతర్జాతీయ మాదకద్రవ్య రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టే కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గురువారం గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి అనుబంధంగా అన్ని జిల్లాలలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం అక్కడి నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు ప్రత్యేక ర్యాలీ ఉంటుందని ఈ సందర్భంగా వారు వివరించారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశా వర్కర్లు, ఇతర ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది, వివిధ వర్గాల ప్రజలను ఈ ర్యాలీలో భాగస్వాములను చేయాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ర్యాలీలో పాల్గొనే వారికి అవసరమైన ముందస్తు వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ .ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నందున చేయాల్సిన ఏర్పాట్లపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని, నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పదార్థాలను వివరించేలా రూపొందించిన పోస్టర్లను, నిషా ముఖ్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసి పేరు, ఇతర వివరాలను నమోదు చేస్తే డ్రగ్స్ వినియోగ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ర్యాలీలో పాల్గొనే వారికి అవసరమైన ముందస్తుగా గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఐసిడిఎస్ పిడి సువర్ణ, మెప్మా పీడీ శ్రీహరి, డిఆర్డిఏ పిడి నారాయణ, ఎక్సైజ్ ఎస్.ఈ. ఆయేషా బేగం, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిటిసి సుశీల, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కళ్యాణి, డీఈవో కిరణ్ కుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిసిపిఓ దినేష్ కుమార్, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, మహిళా పిఎస్ డిఎస్పి రమణ కుమార్, ఏ.ఆర్. డిఎస్పి కే.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


