బేగంపేట ఆగస్టు 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ లోని ముస్లీం ల ఖబరస్థాన్ సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం సనత్ నగర్ కు చెందిన పలు మసీదు కమిటీల ప్రతినిధులు, ముస్లీం మత పెద్దలు వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. తమకు ఖబరస్థాన్ లేకపోవడం వలన తమలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు (ఖననం) చేయడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, సుదూర ప్రాంతాల్లోని ఖబరస్థాన్ లకు తీసుకెళ్లడం జరుగుతుందని వివరిస్తూ ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేశారు. తమ ప్రాంతంలో స్థలం లేని కారణంగా బేగంపేట లోని ఓల్డ్ కష్టమ్ బస్తీలో ని ఖబరస్థాన్ లో ఖననం నిర్వహించేలా అక్కడి కమిటీని ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే ను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సనత్ నగర్ లో ఖబరస్థాన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశానని, కానీ అందుకు అవసరమైన స్థలం అందుబాటులో లేదని వివరించారు. ఓల్డ్ కష్టమ్ వాసులు కూడా ఖబరస్థాన్ కోసం ఎన్నో సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 60 సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికలలో ఖబరస్థాన్ ఏర్పాటు ను హామీ గా చేసుకున్నారే తప్ప సమస్య పరిష్కరించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కెటిఆర్ సహకారంతో స్థలం కేటాయించడంతో పాటు అభివృద్ధి పనుల కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఎన్నో సంవత్సరాల సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే ఓల్డ్ కష్టమ్ ఖబరస్థాన్ కమిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మసీదు కమిటీ అధ్యక్షులు మహ్మద్, నోమాన్, మాజిద్, యాకూబ్, రహీం, జమీర్, షంషేర్ తదితరులు ఉన్నారు.



