నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ
పేర్కొన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం బిసి స్టడీ సర్కిల్ కార్యాలయంలో జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి సృష్టికర్త, శిల్పకళా నిపుణుడు, వాస్తుశాస్త్ర పితామహుడు గా గౌరవింపబడే విశ్వకర్మ మహర్షి మనందరికీ మార్గదర్శకం అని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శిల్పకళ, వృత్తి పరమైన నైపుణ్యాలకు విశ్వకర్మ ఆరాధన ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. ఈ రోజు సమాజంలోని వృత్తి నిపుణులు, శిల్పులు, కార్మికులు అందరికీ గౌరవప్రదమైన స్థానం కలిగించే విశిష్ట దినంగా ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధిలో కార్మికులు, శిల్పులు, వృత్తిదారుల పాత్ర అమోఘమని, వారి శ్రమ, కృషి, ప్రతిభతోనే సమాజం సుస్థిర అభివృద్ధి సాధిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎస్.జ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు ఏలూరి కోటేశ్వరరావు, పి.ఎస్. బాబు, ఆదిమూలం సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం భవనంలోనూ విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ తో పాటు డీఆర్వో బి. చిన ఓబులేసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
ఒంగోలు కలెక్టరేట్ లో……..
విశ్వకర్మ జయంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ లో విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పాల్గొన్నారు.

