రోడ్డు ప్రమాదాల నివారణ మరియు రోడ్డుభద్రత, ట్రాఫిక్ నియమాల అమలును పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ లో ట్రాఫిక్ సిఐ జగదీష్, ఎస్సైలు మరియు వారి సిబ్బంది కలిసి మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్లపై అనధికారికంగా అమర్చిన లైట్లను గుర్తించి తొలగించారు. అనుమతి లేకుండా అధిక కాంతి వెలువరించే లైట్లు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అమర్చడం ప్రమాదాలకు దారితీస్తుందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారుల దృష్టిని ప్రభావితం చేసి ప్రమాదాలకు దారితీసే దారి తీసే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రభుత్వం అనుమతించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి లైట్లను తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఉల్లంఘనలు గుర్తించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని, సురక్షిత రహదారి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

