రాంగోపాల్ పేట్, ఏప్రిల్ 22 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ నాయకులు బుధవారం సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను మంజూరు చేసి 2017 పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని, అద్దె బస్సులతో డిపోల పరిధి కుంచించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామని, వెంటనే చర్చలు జరిపి పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
