హైదరాబాద్, ఏప్రిల్ 27,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్), సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతోకన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స నిర్వహిస్తుండగానే మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. మధుసూదన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ పత్రికల్లో సుదీర్ఘకాలం సీనియర్ జర్నలిస్టుగా మధుసూదన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. నికార్సైన పాత్రికేయుడిగా, వృత్తి పట్ల ఎంతో నిబద్ధత గల వ్యక్తిగా ఆయనకు పేరుంది. మధుసూదన్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయితీ గల పాత్రికేయుడిని కోల్పోవడం బాధాకరమని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తన సంతాప సందేశంలో తెలిపారు. మధుసూదన్ అకాల మరణం పట్ల పాత్రికేయ లోకం సంతాపం వ్యక్తం చేసింది.
